కువైట్ దేశం లోని ప్రతిష్ఠాత్మకమైన కళా సంఘాలలో ప్రముఖమైనదైన తెలుగు కళా సమితి గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగు భాషని,కళలని,కళాకారులని ప్రోత్సహించటం లో తన వంతు పాత్ర బ్రహ్మాండంగా పోషిస్తూ వస్తున్నది.
2012-13 వ సంవత్సరానికి గాను ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం తమ మొదటి కార్యక్రమాన్ని సెప్టెంబరు 21వ తారీఖున కేంబ్రిడ్జ్ స్కూల్, మంగాఫ్ లో నిర్వహించారు.
మనసు లొతుల్ని మీటే సుమధుర వేణు గానాన్ని నవరసాల సినీ సంగీత విభావరితో మేళవించి రూపొందించిన "వేణు గాన గీతా లహరి" కార్యక్రమం ఆహుతులని ఆద్యంతం సంగీత సాగరం లో ఓలలాడించింది.
దక్షిణ భారత దేశం లో ప్రముఖ వేణువిధ్వాంసులలో ఒకరైన శ్రీ నాగరాజు గారు తన సతీమణి,ప్రముఖ గాయకురాలు శ్రీమతి మణినాగరాజు గారితొ కలసి సుమారు 60 నిమిషాల పాటు వివిధ దేశాలకు చెందిన పలురకాల వెణువులతో చేసిన వేణుగానం ఆశీనులైన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులని చేసింది. సంగీతానికి ఎల్లలు లేవని మరొక్కసారి చాటిచెప్పింది.
తరువాత మొదలైన సినీ సంగీత విభావరి లొ శ్రీమతి మణినాగరాజు గారితొపాటు నేటి మేటి గాయకులైన రేవంత్,సాయిచరణ్ మరియు తేజస్విని నాటితరం మధుర గీతాలనుండి నెటితరం యుగళ గీతాలవరకు తెలుగు చలన చిత్రాలలోని ఆణిముత్యాలవంటి పాటలు పాడి ప్రెక్షకులను ఉర్రూతలూగించారు.
భారతీయ రాయబార కార్యాలయం నుండి ముఖ్య అతిధి గా విచ్చేసిన శ్రీ విధు.పి.నాయర్ గారు, తెలుగు కళా సమితి కి ప్రధాన స్పాన్సర్ అయిన "రిషి జైదీప్ గ్రూప్ ఆఫ్ కంపనీస్" అధినేతలు శ్రీ రిషి కుమార్ రెడ్డి మరియు శ్రీ సుధాకర్ గారు జ్యోతి ప్రజ్వలన చెసి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.అంతకు ముందు తెలుగుభాష గొప్పదనాన్ని తెలియచెసే పాట యువ సభ్యులు పాడగా, తెలుగు పద్యన్ని మరొక సభ్యులు పాడి వినిపించి తెలుగు భాష పట్ల తమ మమకారాన్ని చాటారు.
ముఖ్య అతిధి శ్రీ విధు.పి.నాయర్ గారు రూపాంతరం చెంది కొత్త రంగులు, హంగులు సంతరించుకున్న తెలుగు కళా సమితి వెబ్ సైట్ ని ప్రారంభించారు. కార్యవర్గమంతా కలిసి కళాకారులను ముఖ్య అతిధిని స్పొన్సొర్స్ ను ఘనంగా ఖర్జూర దందలు, దుశ్శాలువలతో సత్కరించుకున్నారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ పాలగుమ్మి సుబ్బారావు గారు అధ్యక్షొపన్యాసం ఇస్తూ మన తెలుగు కళలను,కళాకారులను ప్రొత్సహించుటలొ తెలుగు కళా సమితి నిబద్ధతను మరొక్కసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భం గా తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ రెడ్డి ప్రసాద్ గారు సహకార కార్యవర్గ సభ్యులను పరిచయం చేసారు. చిరంజీవులు స్వేత మరియు రత్నమనొజ్ఞ వ్యాఖ్యాతలుగా కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు.
తెలుగుదనం నిండిన ఆ చల్లని సాయంత్రం "వేణు గాన గీతా లహరి" తో రసభరితమై పులకించి మురిసింది. నాలుగున్నర గంటలపాటు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలింగించి మధురమైన జ్ఞాపకాలను తోడుగా పంపింది. |